పవన్ వల్లే ఉద్యోగం, భూమి.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: సుగాలి ప్రీతి తల్లికి హైపర్ ఆది సూటి ప్రశ్న

  • సుగాలి ప్రీతి తల్లి విమర్శలకు హైపర్ ఆది కౌంటర్
  • పవన్ ప్రశ్నించిన తర్వాతే మీ కుటుంబానికి సాయం అందిందని వెల్ల‌డి
  • ఓట్ల కోసం పోరాడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదని వ్యాఖ్య‌
  • పక్కవాళ్ల మాటలు విని పవన్‌ను నిందించవద్దన్న ఆది
  • పాలు పోసిన వ్యక్తినే కాటేయడం సరికాదని హితవు
కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి చేసిన విమర్శలకు జనసేన నేత, సినీ నటుడు హైపర్ ఆది ఘాటుగా స్పందించారు. పక్కవాళ్ల మాటలు విని, పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శించడం తగదని హితవు పలికారు. సాయం చేసిన వ్యక్తినే నిందించే మనస్తత్వం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని, ఓట్ల కోసమే ఈ అంశాన్ని వాడుకున్నారని ప్రీతి తల్లి ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఒక వీడియో ద్వారా స్పందించారు.

"అమ్మా.. మీరు మీ పాప కోసం పోరాడుతున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా స్పందించిందా? పవన్ కల్యాణ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే దేశం మొత్తం తెలిసింది. ఆయన ప్రశ్నించిన తర్వాతే భయపడి అప్పటి ప్రభుత్వం మీ భర్తకు ఉద్యోగం, మీకు భూమి ఇచ్చింది. ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? పవన్ డిమాండ్ చేయకముందే ప్రభుత్వం ఇచ్చి ఉంటే అది ప్రేమ అనుకోవచ్చు. ఆయన అడిగాక ఇచ్చారంటే అది ఆయనపై ఉన్న భయం అనుకోవాలి" అని ఆది వివరించారు.

"పవన్ కల్యాణ్ ప్రోద్బలంతోనే కేసు సీబీఐకి వెళ్లింది. ఛార్జిషీట్‌లో పేర్లు మార్చేసి, సీబీఐకే అంతుచిక్కకుండా ఉన్న కేసు గురించి పవన్ ఇంకెంతకాలం పోరాడాలి? తన నెల జీతం కూడా తీసుకోకుండా పిఠాపురంలోని అనాథ పిల్లలకు ఇచ్చే వ్యక్తి, కులమతాలు చూడకుండా రైతులను ఆదుకునే వ్యక్తి ఓట్ల కోసం ఒక అంశాన్ని వాడుకుంటారా? పాలు పోసిన వ్యక్తినే కాటేసే మనస్తత్వం మీకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని పవన్‌ను విమర్శించడం మానుకోవాలి. పవన్ కాకుండా మీకు ఎవరైనా న్యాయం చేయగలిగితే, నా జీవితంలో జనసేన గురించి మాట్లాడను" అంటూ ఆది సవాల్ విసిరారు. ఈ పరిణామంతో సుగాలి ప్రీతి కేసు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

Sugali Preethi
Pawan Kalyan
Hyper Aadi
Janasena
YS Jagan
Andhra Pradesh Politics
Kurnool District
Sugali Preethi Case
CBI Investigation
Political Criticism

More Telugu News